విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి - జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
డా. పేట భాస్కర్, ఎడిటర్ / ప్రజా దండోర న్యూస్ జూన్ 19 :
జగిత్యాల పట్టణంలోని పురాతన పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, భోజన నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు.
విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న ఆహారం నాణ్యత, రుచి పై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భోజనం సక్రమంగా, సమయానికి అందుతున్నదా అనే అంశాన్ని కూడా పరిశీలించారు. డైట్ మెను, వంటగది పరిశుభ్రత, నీటి వినియోగం, నిల్వ, కిచెన్ షెడ్ విధానాలపై ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహా పంక్తి భోజనం చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని తెలిపారు. పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తు దృష్ట్యా పోషకాహారం సమృద్ధిగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను ఖచ్చితంగా అమలు చేసి, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి విద్యార్థికి సమానంగా, సమయానికి, సురక్షితమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి కె. రాము, జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, పాఠశాల ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.



0 Comments