గడీ బురుజు స్థలాలలో ఎలాంటి రిజిస్ట్రేషన్‌లు చేయవద్దు, అది ప్రజా ఆస్తిగానే ఉంచండి
నకిలీ పత్రాల ద్వారా ప్రజా ఆస్తిని ప్రైవేటు వ్యక్తుల పేర్లపై నమోదు చేసే ప్రయత్నం జరిగితే వెంటనే ఆపండి..!
కోరుట్ల సబ్-రిజిస్ట్రార్‌కు వినతిపత్రం సమర్పించిన అఖిలపక్ష, ప్రజా సంఘాల నాయకులు
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, జూన్ 09:
కోరుట్ల పట్టణంలోని చారిత్రాత్మక గడీ బురుజుల ఆస్తి, స్థలాల విషయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నకిలీ పత్రాల ద్వారా ప్రజా ఆస్తిని ప్రైవేటు వ్యక్తుల పేర్లపై నమోదు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై గత జనవరి మాసంలో మరియు ఇప్పుడు అఖిలపక్ష ప్రజా సంఘాల ప్రతినిధులు డాక్టర్ పేట భాస్కర్, ఎం డి ముజాహిద్ లు సబ్-రిజిస్ట్రార్ డి అశోక్ కు గడి స్థలాలలో ఎలాంటి రిజిస్ట్రేషన్ లు చేయవద్దని వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడీ బురుజు ఆస్తి చాణక్యుల కాలం నాటి సంపద అని చారిత్రాత్మక ఖాళీ స్థలంగా గుర్తింపు పొందిందని, ఇది ప్రజల ఆస్తిగా భావించబడుతోందని తెలిపారు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు తప్పుడు వ్యాఖ్యలు మరియు బేస్‌లెస్ క్లెయిమ్స్ సృష్టించి ఈ భూమిని అక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపించారు.
ఈ అంశంపై గతంలో అఖిలపక్ష ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు నిర్వహించడంతో పాటు సుమారు 30 మంది కౌన్సిలర్లు సంతకాలతో కూడిన వినతిపత్రాలను అధికారులకు సమర్పించమని వారు గుర్తు చేశారు. ఈ విషయం కోరుట్ల ప్రజలందరికీ తెలిసిన విషయమని వారు పేర్కొన్నారు.
అయితే తాజాగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు సమాచారం రావడంతో ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని స్పష్టం చేశారు. ఒక వేళ రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే సబ్-రిజిస్ట్రార్ అశోక్ ఏ ఆధారాలపై అనుమతి ఇచ్చారు? సమర్పించిన పత్రాలు నిజమా? నకిలీ పత్రాలా? అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయని వాటిని ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ఆస్తికి సంబంధించిన అన్ని రిజిస్ట్రేషన్ వివరాలు, యాజమాన్య పత్రాలు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, లీగల్ హెయిర్ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్ నెంబర్లు, సర్వే నంబర్లు, హద్దులు, ఎన్‌కంబ్రెన్స్ రికార్డులు, ఇండెక్స్ రికార్డులు మరియు ఇతర ఆధారాలను పూర్తిగా బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు.
గడీ బురుజు ఆస్తి విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలని, ఏవైనా అక్రమాలు జరిగి ఉంటే వాటిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్షాలు మరియు ప్రజా సంఘాల నాయకులు కోరారు.
ప్రజా ఆస్తుల పరిరక్షణ విషయంలో అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని, ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈకార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు చింత భూమేశ్వర్, శనిగారపు రాజేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments