అర్ధరాత్రి వేళ నిఘా మరింత పటిష్టం - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ - ప్రజా దండోర

 


అర్ధరాత్రి వేళ నిఘా మరింత పటిష్టం  - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్


జిల్లాలో ఆకస్మికంగా పెట్రోలింగ్ వ్యవస్థను తనిఖీ చేసిన ఎస్పీ


ప్రజా దండోర న్యూస్ / పేట ప్రభాస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, మే 22:


జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు రాత్రి వేళ నిఘాను మరింత బలోపేతం చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు, చట్టవ్యతిరేక చర్యలు, దొంగతనాలు తదితర ఘటనలను అరికట్టేందుకు బ్లూ కోల్ట్స్, పెట్రోకార్ వాహనాలతో నిరంతర గస్తీ నిర్వహించడంతో పాటు నైట్ బీట్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జిల్లా ఎస్పీ జగిత్యాల, కోరుట్ల, మేడిపల్లి ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి పెట్రోలింగ్ విధానాన్ని స్వయంగా పరిశీలించారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.





ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాత్రి సమయంలో సమర్థవంతమైన పెట్రోలింగ్ నిర్వహించడం ద్వారా ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమన్నారు. సమయానుకూలంగా స్పందిస్తూ నేరాలకు ముందుగానే అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. ముఖ్యంగా దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు, చట్టవ్యతిరేక చర్యలను నియంత్రించేందుకు రాత్రి నిఘాను మరింత పటిష్టం చేశామని పేర్కొన్నారు. జిల్లాలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, ఎలాంటి అనుమానాస్పద ఘటనలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Post a Comment

0 Comments