యువతకు నైపుణ్యాభివృద్ధి – ఉపాధి అవకాశాలపై విస్తృత అవగాహన కల్పించాలి - మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

 


యువతకు నైపుణ్యాభివృద్ధి – ఉపాధి అవకాశాలపై విస్తృత అవగాహన కల్పించాలి 

జిల్లా అధికారులను ఆదేశించిన  సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ప్రజా దండోర న్యూస్ / హైద్రాబాద్ , ఏప్రిల్ 22 :

రాష్ట్ర యువత భవిష్యత్తు దృష్ట్యా, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు చెందిన యువకులు, యువతులు ప్రభుత్వం అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి, ఉపాధి మరియు స్వయం ఉపాధి పథకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని  సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక వెల్ఫేర్ వీక్ లో భాగంగా మంగళవారం  ఉదయం జిల్లా స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో భారీ స్థాయిలో “జిల్లా స్థాయి నైపుణ్యాభివృద్ధి అవగాహన కార్యక్రమాలు” నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

ఈ కార్యక్రమాలను సమగ్రంగా, ప్రభావవంతంగా నిర్వహించేందుకు కింది అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి  సూచించారు

• పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, ఉపాధి & శిక్షణ విభాగం, నైపుణ్యాభివృద్ధి సంస్థలు, బ్యాంకులు, విద్యాసంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు సమన్వయంతో పాల్గొనాలని సూచించారు.

• ప్రతి శాఖ తమ పరిధిలో అమలవుతున్న శిక్షణ కార్యక్రమాలు, అర్హతలు, ఎంపిక విధానం, ఉపాధి అవకాశాలను స్పష్టంగా ప్రజలకు వివరించాలని తెలిపారు.

• శిక్షణ పొందిన యువత విజయ గాథలను ప్రదర్శించి, ఇతరులకు ప్రేరణ కల్పించాలన్నారు.

• ప్లేస్‌మెంట్ అవకాశాలు, పరిశ్రమల అవసరాలు, భవిష్యత్ నైపుణ్యాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించాలని తెలిపారు.

• కార్యక్రమ స్థలంలోనే నమోదు (On-spot Registration) సదుపాయం కల్పించి, నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్దేశించారు.

• అందిన దరఖాస్తులను డిజిటల్ డేటాబేస్‌గా రూపొందించి, అభ్యర్థుల అర్హతలకు అనుగుణంగా తక్షణ శిక్షణకు అనుసంధానం చేయాలి.

• మహిళా యువత, గ్రామీణ యువత, దివ్యాంగులు ప్రత్యేకంగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

• బ్యాంకులతో సమన్వయం చేసి స్వయం ఉపాధి రుణాలపై అవగాహన కల్పించాలన్నారు.

• స్థానిక ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు

• కార్యక్రమాల నిర్వహణలో పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

ఈ కార్యక్రమాల ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్పష్టమైన దిశానిర్దేశం లభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.


Post a Comment

0 Comments