సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్


సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్


 - వాహనాలకు రేడియం స్టిక్కర్లు తప్పనిసరి


డా. పేట భాస్కర్, ఎడిటర్ / ప్రజా దండోర న్యూస్ :


రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Arrive Alive – A Campaign for Safer Roads” కార్యక్రమంలో భాగంగా సోమవారం కొరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో కొరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాలకు చెందిన లారీ, ఐచర్ మరియు ఇతర భారీ వాహనాల డ్రైవర్లు, యజమానుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ట్రాఫిక్ నియమాలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రాముఖ్యత, రహదారి భద్రతపై మార్గదర్శకాలు అందించారు.


ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “Arrive Alive” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.


రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.


రాత్రి సమయంలో వాహనాలను రోడ్డు పక్కన నిలిపే సందర్భాల్లో రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని, తద్వారా ఇతర వాహనదారులకు వాహనాలు స్పష్టంగా కనిపించి ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అధిక ప్రకాశం ఉన్న ఎల్ఈడి లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తాయని, వాటిని నియంత్రణలో వినియోగించాలని సూచించారు. అలాగే అధిక లోడ్‌తో లారీలు, ఐచర్ వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు.


ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ స్వయంగా లారీలు, వ్యాన్ వాహనాలకు రేడియం స్టిక్కర్లను అతికించి డ్రైవర్లకు భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు.


అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, ఎంవిఐ శ్రీనివాస్ తదితరులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు.


ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్, కొరుట్ల ఎస్సైలు చిరంజీవి, రామచంద్రం, మెట్‌పల్లి ఎస్సై కిరణ్, మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి, కథలాపూర్ ఎస్సై రవికిరణ్, అలాగే లారీ, వ్యాన్ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు, యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Post a Comment

0 Comments