మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి-జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
ప్రజా దండోర న్యూస్ / సురేష్ కొడిపెల్లి / జగిత్యాల ప్రతినిధి :
జగిత్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. మంగళవారం మెట్‌పల్లి, కోరుట్ల మరియు జగిత్యాల పట్టణాల్లో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలింగ్ సిబ్బందికి కేటాయించిన బాధ్యతల పంపిణీ తీరును సమీక్షించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన లాజిస్టిక్స్, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు మరియు ఇతర ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనాలను స్వయంగా తనిఖీ చేసి వంటశాల, భోజనశాలల్లో పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు.
భోజనాల అనంతరం పోలింగ్ సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు ఎన్నికల సామగ్రితో ఏర్పాటు చేసిన బస్సుల్లో సమయానికి చేరుకోవాలని, అధికారులు సూచించిన ప్రదేశాల్లోనే బస చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ రోజున ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు పూర్తిగా ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది సమయపాలన పాటించాలని, నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, రాయికల్, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలలో మొత్తం 136 వార్డులు ఉండగా 2,31,627 మంది ఓటర్లు ఉన్నారు. ఇందుకోసం 379 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 455 మంది పోలింగ్ అధికారులు, 455 మంది సహాయ అధికారులు, 1,637 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చి విధులు కేటాయించారు. అన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం ఏర్పాటు చేసి పోలింగ్ సరళిని కలెక్టరేట్ నుంచి నేరుగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు తెలిపారు. 24 గంటల పాటు టోల్ ఫ్రీ నంబర్ 96662 34383 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్లు శ్రీనివాస్, జీవాకర్ రెడ్డి, మదన్ మోహన్, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

0 Comments