
రోస్టర్ పాయింట్లలో తేడా వస్తే రేవంత్ సర్కార్‌తో యుద్ధమే

మాదిగలకు జనాభా దామాషా ప్రకారం 15 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి - పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ
డా. పేట భాస్కర్, ఎడిటర్, ప్రజా దండోర న్యూస్ / హైదరాబాద్ ఓయూ, అక్టోబర్ 06 :
ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ పాయింట్లను సవరించే పేరుతో మాదిగలకు అన్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే సహించేది లేదని, అవసరమైతే రేవంత్ సర్కార్‌తో తాడోపేడో తేల్చుకుంటామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు.
ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ముందు ఎంఎస్‌ఎఫ్ జాతీయ సదస్సు డా. సీహెచ్ సోమశేఖర్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు జనాభా దామాషా ప్రకారం న్యాయమైన వాటా దక్కలేదన్నారు. ఎస్సీ రిజర్వేషన్లను పెంచి, జనాభా ప్రాతిపదికన మాదిగలకు 15 శాతం వాటా కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ రోస్టర్ సవరణ పేరుతో కమిటీలను ఏర్పాటు చేయడం సరికాదని అన్నారు. ప్రభుత్వం కుట్రలకు పాల్పడితే మాదిగ విద్యార్థులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కుల వివక్ష నిర్మూలన, సామాజిక న్యాయం కోసం మాలలు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రకులాల్లోని పేదలను కలుపుకొని సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతల నిర్మూలన కోసం భవిష్యత్ ఉద్యమాలు చేపడతామని తెలిపారు. విద్యారంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, సంక్షేమ హాస్టళ్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై ఎంఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా భవిష్యత్ పోరాటాలు నిర్వహిస్తామని మంద కృష్ణ మాదిగ ప్రకటించారు.



0 Comments