డిజేలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు - రీల్స్, సెల్ఫీల పేరుతో ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలి- జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్





గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి - జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్

గణేష్ శోభాయాత్ర మార్గాల్లో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా, జిల్లావ్యాప్తంగా 700 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు

డిజేలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు - రీల్స్, సెల్ఫీల పేరుతో ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలి

ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 23:


గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించనున్న గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా జరిగేలా జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా సుమారు 700 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.



జిల్లా పరిధిలోని ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమాలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని, శోభాయాత్రలు వెళ్లే మార్గాలు, ప్రధాన కూడళ్లు, నిమజ్జన ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో పోలీసు సిబ్బందిని మోహరించడంతో పాటు సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకునేలా పోలీస్ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

నిమజ్జన ప్రాంతాల్లో భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన చోట భారీ క్రేన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిమజ్జనం సందర్భంగా నీటిలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్థానిక గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు.

గణేష్ శోభాయాత్రలు సజావుగా సాగేందుకు ట్రాఫిక్ నియంత్రణపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. శోభాయాత్ర మార్గాల్లో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చోట ట్రాఫిక్ మళ్లింపులు, బారికేడింగ్ వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. శోభాయాత్ర సమయంలో అత్యవసర వాహనాలకు, అంబులెన్స్‌లకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్వాహకులు సహకరించాలని కోరారు.

డి.జే లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు:*  డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్స్ వినియోగం విషయంలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని,అధిక శబ్దం వల్ల వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు, విద్యార్థులు, ఇతర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. పోలీసుల సూచనలకు విరుద్ధంగా వ్యవహరించడం, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడటం, నిబంధనలు ఉల్లంఘించడం వంటి వాటిని అనుమతించబోమని స్పష్టం చేశారు.

రీల్స్, సెల్ఫీల పేరుతో ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలి:* గణేష్ శోభాయాత్ర సమయంలో రీల్స్, సెల్ఫీలు తీసుకునే క్రమంలో ప్రమాదకరంగా వాహనాలపైకి ఎక్కడం, క్రేన్లు లేదా విగ్రహాలపైకి ఎక్కడం, నీటి ప్రాంతాల వద్ద ప్రమాదకరంగా సెల్ఫీలు తీసుకోవడం, వాహనాల కదలికలకు అడ్డుగా నిలబడటం వంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు. సోషల్ మీడియాలో వీడియోలు, రీల్స్ కోసం తమ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని కోరారు.

శోభాయాత్ర సమయంలో యువత అత్యుత్సాహానికి గురికాకుండా సంయమనం పాటించాలని, మద్యం సేవించి నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనవద్దని, వాహనాలను నిర్లక్ష్యంగా లేదా వేగంగా నడపవద్దని సూచించారు. ముఖ్యంగా గణేష్ విగ్రహాలను తరలించే వాహనాలపై అధిక సంఖ్యలో వ్యక్తులు ప్రయాణించకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.


గణేష్ నిమజ్జనోత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఆర్‌అండ్‌బీ, విద్యుత్, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక తదితర శాఖలతో సమన్వయంతో చర్యలు చేపట్టినట్లు తెలిపారు.పోలీసు అధికారులు, సిబ్బంది 24×7 అప్రమత్తంగా ఉంటూ ప్రతి ప్రాంతంలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. 

గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు పోలీస్ శాఖ సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ పోలీసులకు సహకరించాలని శోభాయాత్ర సమయంలో క్రమశిక్షణ పాటిస్తూ, నిర్ణయించిన మార్గాల్లోనే విగ్రహాలను తరలించాలని సూచించారు. ప్రతి ఒక్కరి సహకారంతో గణేష్ నిమజ్జనోత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేలా జిల్లా పోలీస్ శాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని తెలిపారు.

Post a Comment

0 Comments