ఐలాపూర్ మహిళపై దాడి కేసులో పోలీసుల వివరణ
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు: మెట్పల్లి డీఎస్పీ రాములు
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల, సెప్టెంబర్ 16:
కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో మహిళపై దాడికి సంబంధించిన కేసులో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మెట్పల్లి డీఎస్పీ ఏ. రాములు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐలాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఆగస్టు 24న తన ఇంటి నుంచి వెళ్లిపోవడంతో, ఆమె భర్త కోట దుర్గయ్య ఆగస్టు 25న కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అనంతరం సెప్టెంబర్ 2న సదరు మహిళ, ఆమె మరిది జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ను నమోదు చేసి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం కోరుట్ల పోలీసులు కూడా ఇరువురికి కౌన్సెలింగ్ ఇచ్చి వారిని వారి ఇళ్లకు పంపించారు.
తదుపరి ఐలాపూర్ గ్రామంలో ఇరువర్గాల కుల పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సదరు మహిళ తన మరిదితో కలిసి ఉంటానని చెప్పినట్లు, అనంతరం ఆమె అతని వద్దకు వెళ్లి ఉంటున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఈ క్రమంలో సదరు మహిళపై ఆమె మరిది మొదటి భార్యకు సంబంధించిన బంధువులు ఇంటికి వచ్చి దాడి చేసినట్లు ఫిర్యాదు అందింది. మహిళ ఫిర్యాదు మేరకు సెప్టెంబర్ 15న కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, నిందితులపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
అయితే ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో మహిళపై అత్యంత తీవ్రమైన ఆరోపణలతో ప్రచారం జరుగుతోందని, అందులో పేర్కొన్న విధంగా ఆమెపై మర్మాంగాలపై కారం చల్లడం, వివస్త్రను చేయడం వంటి ఘటనలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణ కాలేదని డీఎస్పీ ఏ. రాములు తెలిపారు. మహిళ ముఖంపై కారం చల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్న అంశమే ప్రాథమికంగా తమ దృష్టికి వచ్చిందన్నారు.
కేసు దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తులో వెల్లడయ్యే ఆధారాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మెట్పల్లి డీఎస్పీ ఏ. రాములు స్పష్టం చేశారు. సమావేశంలో కోరుట్ల సిఐ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
— ప్రజా దండోర

0 Comments