ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ పథకాలను సకాలంలో అమలు చేయాలి : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
ఎస్సీ, ఎస్టీ కాలనీల అభివృద్ధికి సబ్ ప్లాన్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలి
అట్రాసిటీ బాధితులకు సత్వర పరిహారం, ఉద్యోగాలు అందేలా చర్యలు
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను నియామకాలు, పదోన్నతుల్లో తప్పనిసరిగా అమలు చేయాలి
ఎస్సీ ప్రాంతాలకు 15 శాతం, ఎస్టీ ప్రాంతాలకు 10 శాతం నిధుల కేటాయింపు
అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణానికి ప్రాధాన్యత
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో శిక్షల శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలి
ఎస్సీ, ఎస్టీ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
డా. పేట భాస్కర్, ఎడిటర్ / ప్రజా దండోర న్యూస్, జగిత్యాల సెప్టెంబర్ 01:
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయం తో పనిచేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.
మంగళవారం జగిత్యాల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లతతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు, అంతర్ కుల వివాహ ప్రోత్సాహకాలు, పీఎం అజయ్ పథకం, అట్రాసిటీ చట్టంపై అవగాహన కార్యక్రమాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, మున్సిపల్ కార్మికులకు బీమా, 2బీహెచ్‌కే ఇళ్లు, పీఎం విశ్వకర్మ, అంగన్‌వాడీ కేంద్రాలు, పీహెచ్‌సీలు, ఎస్సీ, ఎస్టీ పంచాయతీల్లో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా *కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ,* ఎస్సీ, ఎస్టీలకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలను నిర్ణీత సమయంలో ఎలాంటి జాప్యం లేకుండా జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్, కులాంతర వివాహ ప్రోత్సాహక పథకాలకు సంబంధించిన పెండింగ్ నిధులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు ఎంత పరిహారం అందించారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు అనే వివరాలతో సమగ్ర నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్లలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల వివరాలు సమర్పించాలి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన వివరాలను ప్రత్యేకంగా సమర్పించాలని కమిషన్ చైర్మన్ సూచించారు.
ఎస్.డీ.ఎఫ్., సీ.డీ.పీ., ఎం.పీ. ల్యాడ్స్ నిధులు మంజూరు చేసే సమయంలో ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గ్రామాలకు అవసరమైన నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎస్సీ ప్రాంతాల అభివృద్ధికి 15 శాతం, ఎస్టీ ప్రాంతాల అభివృద్ధికి 10 శాతం నిధులు కేటాయించేలా చూడాలని తెలిపారు. కేటాయించిన నిధులతో పనులు సక్రమంగా చేపట్టకపోతే సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
*రూ.2,500 కోట్ల సబ్‌ప్లాన్ నిధులను సద్వినియోగం చేయాలి*
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సుమారు రూ.2,500 కోట్ల సబ్‌ప్లాన్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మంచి రహదారులు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీ నిధులతో చేపట్టాల్సిన పనులకు అవసరమైన అంచనాలను ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ ఈఈలు సిద్ధం చేసి సమర్పించాలని, నిధులను సక్రమంగా వినియోగిస్తూ పనులను పూర్తి చేయాలని సూచించారు.
*నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు తప్పనిసరి*
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల సమయంలో కూడా రిజర్వేషన్ రోస్టర్‌ను తప్పనిసరిగా పాటించాలని కమిషన్ చైర్మన్ స్పష్టం చేశారు. పదోన్నతుల్లో కూడా రోస్టర్‌ను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
జిల్లాలోని మూడు పట్టణ మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల్లో పెద్ద సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఉన్నందున వారికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తరహాలో రూ.30 లక్షల బీమా కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు కూడా ఎస్.బి. ఐ. బ్యాంక్ ద్వారా బీమా సౌకర్యం కల్పించాలని అన్నారు.
*అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలే లక్ష్యం*
అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి అవసరమైన అంచనాలను సిద్ధం చేసి పంపించాలని సూచించారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
అంగన్‌వాడీ భవనాల అనంతరం మహిళా భవనాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్‌వాడీ భవనాలను VBGRAMG కింద, పట్టణ ప్రాంతాల్లో CDP కింద ప్రతిపాదించాలని తెలిపారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రం సొంత భవనంలో నిర్వహించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు.
*అట్రాసిటీ కేసుల్లో శిక్షల శాతం పెంచాలి*
ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీకి పాల్పడే వారికి చట్టంపై భయం కలిగేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్మన్ అన్నారు. అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తు, విచారణను సమర్థవంతంగా నిర్వహించి శిక్షల శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మండల కేంద్రాల్లో సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, తహసీల్దార్లు, ఎస్‌ఐలు తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు. ఎక్కువ సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా కేంద్ర ప్రదేశాల్లో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూ సమస్యలను రెవెన్యూ శాఖ అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని అన్నారు.
*అట్రాసిటీ బాధితులకు 2బీహెచ్‌కే ఇళ్లు*
ఎస్సీ, ఎస్టీ హత్య, అత్యాచార కేసుల్లో బాధిత కుటుంబాలకు 2బీహెచ్‌కే ఇళ్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్మన్ సూచించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఈ విధానం అమలు చేస్తున్నామని, దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో ఈ తరహా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
*అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లత మాట్లాడుతూ* జిల్లాలో 85 కులాంతర వివాహ ప్రోత్సాహక దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్‌కు సంబంధించి సుమారు రూ.2.42 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితుల్లో ఐదుగురికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు.
వారం రోజుల క్రితం 185 మంది బాధితులకు రూ.1.06 కోట్లకు పైగా పరిహారం విడుదలైందని, ఆ మొత్తం వెంటనే వారి ఖాతాల్లో జమ కానుందని తెలిపారు. మరో 91 మంది బాధితులకు రూ.69.45 లక్షల పరిహారం పెండింగ్‌లో ఉందని, ఉన్నతాధికారుల సమాచారం మేరకు వారంలోగా విడుదల కానుందని వివరించారు.
పీఎం అజయ్ పథకం కింద 144 యూనిట్లు గ్రౌండింగ్ కాగా, మరో 30 యూనిట్లు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద 317 యూనిట్ల లక్ష్యానికి గాను 219 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు వివరించారు.
గత సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లా రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచినట్లు అధికారులు తెలిపారు.
*అదనపు ఎస్పీ చేతన్ నితిన్ మాట్లాడుతూ* జిల్లాలో మొత్తం 973 ఎస్సీ, 138 ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీటిలో 870 కేసుల్లో ట్రూ ఎఫ్‌ఐఆర్ ఫైనలైజ్ కాగా, 787 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసినట్లు వివరించారు. 295 కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలైనట్లు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశాన్ని అధికారులు ప్రాధాన్యతతో తీసుకొని, పథకాల అమలులో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాజ గౌడ్, కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, లక్ష్మి నారాయణ, ప్రవీణ్, ఆర్డీవోలు, డిఎస్పీలు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖ అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కిషోర్, సంబంధిత అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్ లు, ఎంపిడివోలు మరియు తదితరులు పాల్గొన్నారు.





0 Comments