చరిత్రలో.. సెప్టెంబర్ 24న పూనా ఒప్పందం ద్వారా అంబేద్కర్ కోరిన ప్రత్యేక నియోజకవర్గాలు రద్దయ్యాయి
– అరియ నాగసేన బోది
ప్రజా దండోర న్యూస్ / సెప్టెంబర్ 24 :
భారత చరిత్రలో 1932 సెప్టెంబర్ 24 అత్యంత కీలకమైన రోజని, ఈ రోజును బ్లాక్ డేగా పాటించాలని తన రచనల్లో అరియ నాగసేన బోధి పేర్కొన్నారు.
1932 ఆగస్టు 16న బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సే మెక్‌డొనాల్డ్ ప్రకటించిన కమ్యూనల్ అవార్డు ద్వారా అప్పటి ‘డిప్రెస్డ్ క్లాసెస్’కు ప్రత్యేక నియోజకవర్గాల హక్కు కల్పించబడింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రత్యేక రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఈ అంశాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లారు.
రౌండ్ టేబుల్ సమావేశాల్లో అంబేద్కర్ ప్రధానంగా చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం, ప్రత్యేక నియోజకవర్గాలు, రాజకీయ రక్షణలు, వయోజన ఓటు హక్కు వంటి అంశాలపై తన వాదనలను వినిపించారు.
అయితే కమ్యూనల్ అవార్డులోని ప్రత్యేక నియోజకవర్గాలను మహాత్మా గాంధీ వ్యతిరేకిస్తూ 1932 సెప్టెంబర్ 20న నిరాహారదీక్ష ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్, గాంధీ తదితర నాయకుల మధ్య చర్చల ఫలితంగా సెప్టెంబర్ 24న పూనా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రత్యేక నియోజకవర్గాల స్థానంలో ఉమ్మడి నియోజకవర్గాల్లో రిజర్వ్‌డ్ సీట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. అదే సమయంలో రిజర్వ్‌డ్ సీట్ల సంఖ్య కమ్యూనల్ అవార్డులో ప్రతిపాదించిన దానికంటే పెరిగింది.
ప్రత్యేక నియోజకవర్గాలు రాజకీయ స్వయం ప్రాతినిధ్యానికి ముఖ్యమైన సాధనమని అంబేద్కర్ భావించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. అనంతరం 1945లో ఆయన రూపొందించిన ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’ పత్రంలోనూ పూనా ఒప్పందం ద్వారా వచ్చిన ఎన్నికల విధానాన్ని రద్దు చేసి ప్రత్యేక నియోజకవర్గాలను పునరుద్ధరించాలని ప్రతిపాదించారు.
అందువల్ల పూనా ఒప్పందం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం, అంబేద్కర్ రాజకీయ పోరాటం, దాని ప్రభావాలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని అరియ నాగసేన బోధి పేర్కొన్నారు.


0 Comments