మావోయిస్టుల దళపతి గణపతి ప్రస్థానం..
అగ్రనేత గణపతి లొంగుబాటు పై తీవ్ర ఉత్కంఠ
ప్రజా దండోర న్యూస్ / డెస్క్ ఇంచార్జీ :
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రం ( అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలం) కు చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి 1949 జూన్ 16న బీర్పూర్‌లో జన్మించారు. అక్కడే ఏడో తరగతి వరకు చదివారు.
జగిత్యాల, కరీంనగర్‌లో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొంది ప్రస్తుత జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం గోవిందారంతో పాటు, పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పని చేశారు.
1972-73 ప్రాంతంలో బీఈడీ ట్రైనింగ్ కోసం వరంగల్ వెళ్లి అజ్ఞాతం బాట పట్టారు. 1976 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తబలాపూర్‌లోని భూస్వామి పితాంబరరావును హతమార్చిన కేసులో జన్నారం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు కాగా.. లక్ష్మణరావును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిజామాబాద్ జైలులో శిక్ష అనుభవించి మూడు నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లారు. 1978 సెప్టెంబర్ 9న ఆ తర్వాత జగిత్యాల పట్టణంలో కొండపల్లి సీతారామయ్య నేతృత్యంలో జగిత్యాల జైతాయాత్ర చేశారు.* ఈ జైత్రయాత్రలో మల్లోజుల కోటేశ్వరరావు, నల్లా ఆదిరెడ్డి, శీలం నరేశ్, తదితరులు పాల్గొన్నారు.
సంచలనాలకు కేంద్ర బిందువు..
ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సంచలనాలకు కేంద్ర బిందువు. రాజకీయ సిద్ధాంతం నుంచి పూర్తిగా మిలిటరీ యాక్షన్‌లోకి దిగిన సందర్భం వరకు ఆయనే పార్టీకి రథసారథి. పీపుల్స్ వార్ గ్రూప్‌ను తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా మరో సాయుధ కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియాతో కలిపి సీపీఐ (మావోయిస్టు)గా మారడానికి విశేష కృషి చేశారు.
ఆయన సారథ్యంలో పార్టీ ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టించింది. రెడ్ కారిడార్ వంటి వ్యూహాత్మక నిర్దేశాలతోపాటు పీఎల్‌జీఏ వంటి గెరిల్లా నిర్మాణాలకు నాంది పలికారు. 2018 తర్వాత పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుని సలహాదారుగా మాత్రమే కొనసాగుతున్నారు. అయితే, గత కొంతకాలంగా పార్టీ కోలుకోలేని విధంగా తగులుతున్న ఎదురుదెబ్బలతో కేడర్ నేలకూలడం, కొందరు ముఖ్యనేతలు లొంగిపోవడంతో ఇప్పుడు ఆయన గురించిన ప్రశ్నలు అందరిలోనూ మెదులుతున్నాయి. గణపతి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో లొంగిపోతారని వస్తున్న వార్తలు అందరిలోనూ ఉత్కంఠను రేపుతున్నాయి. ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన ఎలా ఉంటారు? అన్న ఆసక్తి అందరిలో నెలకొన్నది. ముఖ్యంగా ఆయన స్వస్థలమైన కరీంనగర్ జిల్లాలో ఈ వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
విప్లవ చరిత్రలో కీలకంగా..
ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న 1992 నుంచి 2018 వరకు ఉన్న కాలం భారత విప్లవ చరిత్రలో అత్యంత కీలకమైనది. ఆయన నేతృత్వంలో పార్టీ అనేక వ్యూహాత్మక మార్పులకు, సంచలన ఘటనలకు సాక్షిగా నిలిచింది. 2004లో దేశంలో అతిపెద్ద సాయుధ కమ్యూనిస్టు పార్టీలైన పీపుల్స్ వార్ గ్రూప్, మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియాలు ఒక్కటై సీపీఐ (మావోయిస్టు)గా ఏర్పడింది. ఇది గణపతికి అతిపెద్ద వ్యూహాత్మక విజయం. దీనివల్ల ఉత్తర, దక్షిణ భారతదేశాల్లోని విప్లవ శక్తులు ఏకమయ్యాయి. పశుపతి (నేపాల్) నుంచి తిరుపతి (ఆంధ్రప్రదేశ్) వరకు ఒకే గొలుసుకట్టుగా అటవీ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ 'రెడ్ కారిడార్'ను బలోపేతం చేశారు. పార్టీకి ఒక పటిష్టమైన సైనిక విభాగం ఉండాలని పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)ని స్థాపించి.. గెరిల్లా సైన్యంగా అత్యాధునిక శిక్షణ ఇచ్చారు. ఆయన నేతృత్వంలో మావోయిస్టులు ప్రభుత్వ వ్యవస్థలను కుదిపేశారు. అందులో కొన్ని ప్రధాన సంఘటనలు..
చంద్రబాబు నాయుడుపై అలిపిరి దాడి (2003)..
మావోయిస్టు చరిత్రలో ఇది అత్యంత ధైర్యసాహసాలతో కూడిన దాడిగా భావిస్తారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుమల వెళ్తుండగా అలిపిరి వద్ద మ్యాగ్నెటిక్ మైన్లతో పేల్చివేశారు. ఈ ఘటనలో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
బలిమెల దాడి (2008)..
ఒడిశాలోని బలిమెల జలాశయంలో గ్రేహౌండ్స్ పోలీసుల బోటును ముంచివేసి దాదాపు 38 మంది జవాన్లను చంపడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది గెరిల్లా యుద్ధతంత్రంలో ఒక పరాకాష్టగా నిలిచింది.
చింతల్నార్ (దంతెవాడ) దాడి (2010)..
మావోయిస్టుల చరిత్రలో భద్రతా దళాలపై జరిగిన అతిపెద్ద దాడి ఇది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా చింతల్నార్ వద్ద జరిగిన మాటు దాడిలో ఒకేసారి 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అప్పుడు గణపతి నేతృత్వంలోని సెంట్రల్ కమిటీ ఈ వ్యూహాన్ని రచించింది.
జిరం లోయ దాడి (2013) ..
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్‌పై జరిగిన ఈ దాడిలో మహేంద్ర కర్మ, విద్యాచరణ్ శుక్లా వంటి అగ్రనేతలు సహా 27 మంది మరణించారు. సల్వాజుడుం వంటి కౌంటర్ ఇన్సర్జెన్సీ గ్రూపులను అణచివేయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగింది.
వెంటాడిన వైఫల్యాలు..
గణపతి హయాంలో పార్టీ ఎంతో బలోపేతమైనా, అదే కాలంలో గ్రేహౌండ్స్, కోబ్రా దళాల వ్యూహాల వల్ల పార్టీ పట్టు కోల్పోయింది. 2004 చర్చల వైఫల్యం తర్వాత మావోయిస్టులకు ఆయువుపట్టులా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. నల్లమల అడవులపై ప్రభుత్వం ఆధిపత్యం సాధించింది. ఆజాద్, కిషన్ జీ వంటి కీలక నేతలను కోల్పోవడం పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. గణపతి నాయకత్వం నుంచి తప్పుకున్న తర్వాత పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి చాలా ఇబ్బందులు పడింది. ప్రస్తుతం ఆయన లొంగుబాటు అనేది ఒక సుదీర్ఘ పోరాట యుగం ముగింపుగా నిపుణులు భావిస్తున్నారు.
కుటుంబానికి దూరంగానే..
భూస్వామ్య కుటుంబంలో జన్మించిన ముప్పాళ్ల లక్ష్మణరావు సామాజిక అసమానతల నేపథ్యంలో ఉద్యమ బాట పట్టారు. వామపక్ష భావజాలం కలిగిన గణపతి మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షతుడై భార్య విజయ, కొడుకు శ్రీనివాస్‌ను వదిలిపెట్టి అజ్ఞాత జీవితంలోకి వెళ్లారు. తదనంతరం ఆయన భార్య, కొడుకు అమెరికా వలస వెళ్లినట్లు వారి బంధువుల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన భార్య క్యాన్సర్ బారిన పడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతుండగా కొడుకు శ్రీనివాస్ అమెరికాలో ఉంటున్నారు.
విప్లవ ప్రస్థానం ఇలా..
1949, జూన్ 16 : తెలంగాణలోని కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం జగిత్యాల జిల్లా) సారంగాపూర్ మండలం బీర్పూర్ గ్రామంలో జన్మించారు.
విద్య, ఉద్యోగం : సైన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, వరంగల్‌లో బీఈడీ చేశారు. కొంతకాలం కరీంనగర్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అందుకే ఆయనను పార్టీలో అందరూ 'సార్' అని ఆత్మీయంగా పిలుస్తుంటారు.
1970 ప్రారంభం : వరంగల్‌లో ఉన్నత విద్య చదువుతున్న సమయంలో మావోయిస్టు నేతలు కొండపల్లి సీతారామయ్య, నల్లా ఆదిరెడ్డిల పరిచయంతో విప్లవ భావజాలం వైపు ఆకర్షితులయ్యారు.
1976 : ఉపాధ్యాయ వృత్తిని వదిలి పూర్తిగా అండర్ గ్రౌండ్ (అజ్ఞాతం)లోకి వెళ్లారు. పీపుల్స్ వార్ గ్రూప్‌లో క్రియాశీలక సభ్యుడిగా మారారు.
1992, జూన్ : పీపుల్స్ వార్ పార్టీలో అంతర్గత సంక్షోభం ఏర్పడింది. పార్టీ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్యను బహిష్కరించిన తర్వాత.. గణపతి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
2004, సెప్టెంబర్ 21 : భారతదేశ మావోయిస్టు చరిత్రలో ఇది కీలక మలుపు. పీపుల్స్ వార్ గ్రూప్, మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసీసీఐ) విలీనమై సీపీఐ (మావోయిస్ట్) పార్టీగా ఏర్పడ్డాయి. ఈ నూతన పార్టీకి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా గణపతి బాధ్యతలు చేపట్టారు.
2018, నవంబర్ : వయసు పెరగడం, అనారోగ్య కారణాల వల్ల ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. తన బాధ్యతలను నంబాల కేశవరావు (బసవరాజ్)కు అప్పగించి, పార్టీ సలహాదారుడిగా కొనసాగారు. ప్రస్తుతం లొంగుబాటు ప్రక్రియ నడుస్తోందని ప్రచారం కొనసాగుతుండగా అధికారికంగా ప్రభత్వ పెద్దలు వెల్లడించే వరకు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

0 Comments