గోదావరి పుష్కర పనుల్లో వేగం పెంచాలి
భూసేకరణ, టెండర్లు, అనుమతుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
మహాలక్ష్మి ఘాట్ వద్ద మురుగునీరు గోదావరిలో కలవకుండా చర్యలు తీసుకోవాలి: దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్ 12:
గోదావరి పుష్కరాలు–2027ను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు.
సోమవారం దేవాదాయ కమిషనర్ హనుమంతరావుతో కలిసి సంబంధిత జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భూసేకరణ, ఘాట్ల అభివృద్ధి, రహదారుల నిర్మాణం, టెండర్లు, ప్రభుత్వ అనుమతులు, భక్తులకు అవసరమైన మౌలిక వసతులపై సమీక్షించారు. పెండింగ్ అంశాలను వెంటనే పరిష్కరించి, పనుల నాణ్యతలో రాజీ పడకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు
.
మహాలక్ష్మి ఘాట్ వద్ద మురుగునీటి సమస్యకు పరిష్కారం
ధర్మపురిలోని మహాలక్ష్మి ఘాట్ వద్ద మురుగునీరు గోదావరిలో కలవకుండా పటిష్టమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని దేవాదాయ కమిషనర్ హనుమంతరావు సూచించారు. మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్‌టీపీ) పనులను పుష్కరాల నాటికి పూర్తి చేయాలని, సాధ్యం కాని పక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ధర్మపురి వీఐపీ ఘాట్ అభివృద్ధికి మంజూరైన రూ.6 కోట్లతో పాటు, ధర్మపురిలో రూ.18 కోట్లతో చేపట్టనున్న పనులను వేగవంతం చేయాలని తెలిపారు. ఘాట్‌కు అవసరమైన వంతెనలు, ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు.
కోటిలింగాల నాలుగు వరుసల రహదారి పనులు ప్రారంభించాలి
కోటిలింగాల ప్రాంతంలో నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి రూ.22 కోట్లు మంజూరైన నేపథ్యంలో టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని అధికారులు సూచించారు. పుష్కరాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు పక్కా ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు.
పనులను గడువులోగా పూర్తి చేస్తాం: కలెక్టర్
జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ ధర్మపురి, కోటిలింగాల ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. భూసేకరణకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయని, తదుపరి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మహాలక్ష్మి ఘాట్ వద్ద మురుగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ఎస్‌టీపీ పనులు ఆలస్యమైనా మురుగునీరు గోదావరిలో కలవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు.
పుష్కరాలకు ముందుగానే అన్ని పనులు పూర్తి చేసేలా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తామని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఇంజినీరింగ్, దేవాదాయ, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.




0 Comments