పోలీసు నైపుణ్యాల ప్రదర్శనకు డ్యూటీ మీట్ ఉత్తమ వేదిక – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్
జిల్లా స్థాయి 3వ పోలీస్ డ్యూటీ మీట్–2026 ప్రారంబించిన జిల్లా ఎస్పి
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, జూన్ 22:
పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో మరింత సమర్థవంతంగా రాణించాలంటే వృత్తి నైపుణ్యం అత్యంత అవసరమని, నేర దర్యాప్తు, శాస్త్రీయ ఆధారాల సేకరణ, కేసుల ఛేదన, ప్రజా భద్రత పరిరక్షణ వంటి అంశాల్లో నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహిస్తున్న జిల్లా 3వ పోలీస్ డ్యూటీ మీట్–2026 కార్యక్రమాన్ని ఎస్పీ గారు అదనపు ఎస్పి తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు సిబ్బందిలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఆధునిక దర్యాప్తు పద్ధతులు, ఫోరెన్సిక్ సాంకేతికతలు, నేర పరిశోధనలో అనుసరించాల్సిన ఉత్తమ విధానాలపై అవగాహన పెంపొందించేందుకు డ్యూటీ మీట్ ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని అన్నారు.పోలీసు శాఖలో ప్రతి అధికారి, సిబ్బంది చట్టాలపై సంపూర్ణ అవగాహనతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. నేరస్థులను శాస్త్రీయ ఆధారాలతో న్యాయస్థానంలో దోషులుగా నిరూపించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. పోలీస్ డ్యూటీ మీట్ ద్వారా పోలీసు అదికారులు,సిబ్బంది తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు, అనుభవాలను పంచుకోవడానికి, వినూత్న ఆలోచనలను పరస్పరం మార్పిడి చేసుకునేందుకు చక్కటి వేదిక అని అన్నారు.
ఈ డ్యూటీ మీట్‌లో కంప్యూటర్, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్‌ప్రింట్స్, బాంబ్ డిస్పోజల్, , డాగ్ స్క్వాడ్ ట్రాకింగ్, ఎక్స్‌ప్లోజివ్స్, యాంటీ-సబోటేజ్ చెకింగ్, మరియు కంప్యూటర్ అవగాహన, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని అదేవిధంగా జాతీయ స్థాయిలో నిర్వహించే పోలీస్ డ్యూటీ మీట్‌లో విజేతలకు విశేష గుర్తింపు లభిస్తుందని, రాష్ట్రాలు మరియు ఇతర ప్రాంతాల పోలీసు అధికారుల మధ్య సమన్వయం, సహకారం, వృత్తిపరమైన అనుభవాల మార్పిడి పెరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్, ఐపీఎస్, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, రాములు, ఇన్‌స్పెక్టర్లు ఆరిఫ్ అలీ ఖాన్, సుధాకర్, కరుణాకర్, రవి, లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, వేణు, ఎస్. ఐ లు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




0 Comments