ఉపాధి హామీ పనులు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
ప్రజాదండోర న్యూస్ / జగిత్యాల నియోజకవర్గ ప్రతినిధి, ఏప్రిల్ 9 :
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని నరసింహులపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పరిశీలించారు.
ఈ సందర్భంగా పనుల పురోగతిని సమగ్రంగా ఆరా తీసిన కలెక్టర్, కార్మికుల హాజరు నమోదు విధానం, ఎన్‌ఎంఎంఎస్ యాప్ వినియోగం, జియోట్యాగింగ్ ఫోటో క్యాప్చరింగ్ ప్రక్రియలను పరిశీలించారు. పనుల వద్ద కార్మికుల హాజరు సరైన రీతిలో నమోదు చేయాలని, పర్యవేక్షణను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని, ప్రతి అర్హుడికి పని దొరికేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అనంతరం బీర్పూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి, పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు త్వరితగతిన గృహాలు అందేలా చర్యలు తీసుకోవాలని, నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.తదుపరి నిర్మాణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని పరిశీలించి, పనులు వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడంలో ఈ కేంద్రం కీలకమని పేర్కొన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణలో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా వైద్యులు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రఘువరన్, హౌసింగ్ పీడీ ప్రసాద్, ఈఈపీఆర్ లక్ష్మణ్ రావు, తహసీల్దార్, ఎంపీడీఓ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

0 Comments